నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలులో గంజాయి దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కారాగారంలోకి మాదక ద్రవ్యాలతో పాటు ఇతర మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయన్న ఆరోపణలపై పూర్థి స్థాయిలో విచారణ జరిపారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఒక జైలర్‌ను సస్పెండ్ చేశారు. మరో జైలర్‌పై బదిలీ వేటు వేశారు. సూపరింటెండెంట్‌ను నెల రోజులు సెలవు పెట్టాలని ఆదేశించారు. ఈ నెల 1న ‘ఆంధ్రజ్యోతి’లో ‘నిజామాబాద్ సెంట్రల్ జైలులో గంజాయి గుప్పు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఐజీ మురళిబాబు, డీఐజీ సంపత్ ఈ నెల 3న నిజామాబాద్ సెంట్రల్ జైలులో విచారణ జరిపి డీజీకి నివేదిక అందజేశారు. దాని ఆధారంగా నిజామాబాద్ జిల్లా జైలు జైలర్ ఉపేందర్‌ను సస్పెండ్ చేస్తూ డీజీ ఉత్తర్వులు ఇచ్చారు. వరంగల్ సెంట్రల్ జైలులో పోస్టింగ్‌లో ఉంటూ నిజామాబాద్ జైలులో అటాచ్‌మెంట్ కింద పనిచేస్తున్న జైలర్ సాయి సురేశ్‌ను ఆదిలాబాద్‌కు బదిలీ చేశారు

