విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. ఈ స్టీల్ ప్లాంట్ భూములు విషయంలో ఎవరైనా స్టేట్‌మెంట్ ఇచ్చారా? అని విలేకర్లను ఆయన సూటిగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ భూములను వాటి అవసరాలకు తప్ప, మరే ఇతర అవసరాలకు వినియోగించ లేదని.. వినియోగించబోమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్టాంట్ లాభాల బాటలో నడవాలని.. అందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపునిచ్చారు. బుధవారం విశాఖపట్నంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ కోసం ఎవరూ పోరాటాలు చేయడం లేదని లోకేశ్ పేర్కొన్నారు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ పోర్టు ఎందుకని గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

